నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మజ్లిస్ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి (Akbaruddin Owaisi) పోలీసులు షాకిచ్చారు. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.. మరోవైపు అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాటలు సోషల్ మీడియా చుట్టేస్తున్నాయి.
తాజాగా ఇన్సిడెంట్‌పై సౌత్ ఈస్ట్ జోస్ డీసీపీ రోహిత్ రాజు (DCP Rohit Raj) స్పందించారు. ఘటనపై సంపూర్ణ విచారణ జరిపినట్లు తెలిపారు. మరోవైపు మంగళవారం రాత్రి సంతోష్‌నగర్ పీఎస్ పరిధి మొయిన్‌బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ (MIM Meeting) ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని విచారణలో తేలినట్టు డీసీపీ తెలిపారు. ప్రచారంలో ఉన్న అక్బరుద్దీన్ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు..
అదీగాక ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ సభా వేదిక పైకి ఎక్కినట్లు ఎలాంటి ఆధారాలు లేవని డీసీపీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎంఐఎం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు.
కానీ సభ సమయం దాటిపోతున్నా పట్టించుకోని అక్బరుద్దీన్ దృష్టికి ఈ విషయాన్ని సీఐ తీసుకెళ్లాడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్బరుద్దీన్, సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు.. తన విధులకు ఆటంకం కలిగించినట్టు సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.