టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) పేపర్ లీకేజీ(paper leak) పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. పొరపాటు జరిగిందని అంగీకరించారు. అయితే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం తాము చేయడం లేదని చెప్పారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్ట్ చేయించిందని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ విపక్షాలు మాత్రం తమ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూత్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఉన్నత పదవిలో ఉన్న నేతలు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
యువత ఇదంతా గమనిస్తోందని.. రాజకీయాలంటే దుర్భాషలాడటం కాదని.. భవిష్యత్‌కు బాటలు వేయడం అని హితవు పలికారు. మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. విద్యారంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ భర్తీ చేసింది. ప్రైవేటు రంగంలో రాష్ట్ర యువతకు 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.
అదేవిధంగా, రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. ప్రతీ జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు.