తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఎపిసోడ్ లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయితే ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నామినేషన్లు తిరస్కరణకు గురవుతున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నేతలు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మేడ్చల్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి కందాడి అంజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సదరు సామాన్యుడు లేవనెత్తిన సందేహాలు సంచలనంగా మారాయి. అందులో ఒకే సంవత్సరం 3 కాలేజీల్లో మల్లారెడ్డి ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారని అంజిరెడ్డి ఆరోపించారు..
ప్యాట్నీలోని ప్రభుత్వ కళాశాలలో 1973లో ఇంటర్ చదివానని 2014లో ఎంపీగా పోటీ చేసినపుడు ఇచ్చిన అఫిడవిట్‌లో మల్లారెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఇంటర్ 1973లో పూర్తి చేసినట్టు 2018లో మేడ్చల్ (Medical) ఎమ్మెల్యే (MLA)గా బరిలో దిగినపుడు తెలిపారు.. కాగా తాజా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో 1973లో ఇంటర్ పూర్తి చేసినట్లుగా మలారెడ్డి పేర్కొన్నారు.
ఇదొక్కటే కాదండోయ్.. మల్లారెడ్డి 2014 ఎన్నికల్లో తన వయసు 56గా పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తన వయసు 70గా చూపించారు. అంటే.. 9 ఏళ్లలో మల్లారెడ్డి వయసు 14 ఏళ్లు పెరిగిందన్నమాట. ఇప్పుడిదే పెద్ద రచ్చగా మారింది. మరోవైపు మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మరి అధికారులు ఏం చేస్తారనేది నియోజక వర్గంలో ఉత్కంఠగా మారింది.