గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) మండిపడ్డారు. పేదల సమస్యలను విస్మరించిన కేసీఆర్ (KCR).. ప్రజా సంక్షేమం మరచి రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా నష్టం చేశారని ఆరోపించారు. వారి ఆస్తులని పెంచుకోవాలనే శ్రద్ధ తప్పితే.. రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందన్న సోయి లేకుండా వ్యవహరించారని విమర్శించారు..
ఖమ్మం (Khammam)లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి.. తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా నిబద్ధతో పని చేస్తుందని హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వం మాటలు చెబితే.. ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో చూపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలను ఆమోదించామని మంత్రి అన్నారు.
తమ ప్రభుత్వం చిత్తశుద్ధి వాటి ఆమోదంలో కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు. తమది మాటల ప్రభుత్వం కాదన్న శ్రీనివాసరెడ్డి.. చేతల ప్రభుత్వమని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పులు లేవని.. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి మండిపడ్డారు..
మాజీ సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారని దుయ్యబట్టారు. వైఎస్ కట్టిన భవనం కేసీఆర్‌కు నచ్చలేదని మంత్రి విరుచుకుపడ్డారు. సచివాలయం బాగానే ఉన్నా పడగొట్టి కొత్తది కట్టిన కేసీఆర్.. అన్నిచోట్ల తన మార్కు ఉండాలనుకున్నారు. కానీ పేదల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాక ఏం చేసినా తప్పులేదు. ఆయన తొందర పాటు నిర్ణయాల వల్ల.. పేదవారిని మరింత పేదరికలోకి నెట్టి తాను, తన కుటుంబం మాత్రం కుబేరులైనారని పొంగులేటి విమర్శించారు..