ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ చీఫ్(Congress Chief)గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు చేపట్టడంతో పొలిటికల్ హీట్(Political Heat) మరింత పెరిగింది. షర్మిల తనదైన శైలిలో విమర్శలు చేస్తూ తన సోదరుడు, సీఎం వైఎస్ జగన్‌ను పేరుపెట్టి పెలవడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మంత్రి ఆర్కే రోజా షర్మిలపై విమర్శలు గుప్పించారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్‌ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఏపీకి షర్మిల రావడం అనేది మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, జగన్‌ను కాంగ్రెస్ పార్టీ 16నెలలు జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్‌లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
జగన్ పాలనలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్ ద్వారా మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు. ప్రతి మహిళ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.