సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అని, ఆయన్ని పట్టించుకునే సమయం జగన్ మోహన్ రెడ్డికి లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీఎం జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పడానికి తామేమీ కాంగ్రెస్ లేమని అన్నారు.
అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేయాలని ప్రశ్నించారు. అసలు ఆయన్ని ఎందుకు కలవాలని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మాజీ మంత్రి కొడాలి నాని కలిశారు. అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ…. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమందన్నారు. వాళ్లు తీస్తే ఆ పదవి ఉండదన్నారు.
రేవంత్ రెడ్డిపై ఏపీలో చర్చించడం అనవసరమని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబులా సీఎం జగన్ ఎదురు చూడరని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిది ప్రాంతీయ పార్టీనా అని ప్రశ్నించారు. ఆయనేమైనా సుప్రీంనా..? అని ఫైర్ అయ్యారు. అందుకే ఆయన్ని ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే నేరుగా సోనియా గాంధీని, రాహుల్‌ను కలుస్తామన్నారు. అప్పుడు ఆయనే అపాయింట్మెంట్ ఇస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీని వద్దనే మూసేశామన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు తొంటి ఎముకకు చికిత్స జరిగిందన్నారు. అందుకే కేసీఆర్‌ను సీఎం జగన్ మోహన్‌రెడ్డి వెళ్లి పరామర్శించారని తెలిపారు. రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు.