తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు సాగుతున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు ఆటోల్లో వచ్చారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ (Quthbullapur) ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సైఫాబాద్ (Saifabad) ఏసీపీ (ACP) సంజయ్ (Sanjay)ని ‘యూజ్ లెస్ ఫెలో’అంటూ తిట్టారు. సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో దాడికి పాల్పడ్డారు. అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన వారిలో వివేకానందతోపాటు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ వద్ద ధర్మా చేశారు. ఈ ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్యే వివేకానందకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో వివేకానంద, పోలీసులతో వీధి రౌడీలాగా ప్రవర్తించారు. కాగా ఇలా ప్రవర్తించడం వివేకానందకు మొదటిసారి ఏంకాదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగిన బహిరంగ చర్చలో భూకజ్జాలపై బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మధ్య జరిగిన చర్చ రచ్చగా మారింది.
దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన వివేకానంద.. శ్రీశైలం గౌడ్‌పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. మరోవైపు ఏసీపీ విషయంలో జరిగిన ఘటనపై పోలీసులు, ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.