చిత్తూరు జిల్లా పుంగనూరు (Punganur)లో ఓ ఆలయం (Temple)పై ఓ సామాజిక వర్గం వ్యక్తులు సామూహికంగా దాడి చేశారు. జిల్లాలో ఏటుగడ్డపాలెంలో నిర్మాణంలో ఉన్న ఆలయంపై గత శనివారం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి దిగారని దళితులు ఆరోపించారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన హిందువులను లక్ష్యంగా దాడి జరిగినట్టు హిందూ సంఘాలు ఆరోపిస్తుండగా, తమ జెండాలు, తోరణాలు తొలగించారని మరో సామాజిక వర్గం చెబుతోంది.
పుంగనూరు పట్టణంలో పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది ముస్లింలు తమపై రాడ్‌లు, కర్రలతో దాడి చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తమ కాలనీలోకి చొరబడి రాళ్లు విసురుతూ తమపై దాడికి దిగారని, తమ కులాన్ని, మహిళలను కించపరుస్తూ దూషణలకు దిగారని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయంలోకి చెప్పులు ధరించి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆరోపించారు.
ఆలయంలో ఉన్నదీపాలు విసిరివేశారని, మైకులు విరగొట్టారని అంటున్నారు. ఈ దాడుల్లో దళిత యువకులు చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. అనంతరం కాలనీలో పలువురి ఇండ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. గంగమ్మ అనే మహిళ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడికి యత్నించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో జ్యోతిష్ కుమార్‌కు తీవ్రగాయాలవడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీఐ రాఘవ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ముస్లింలు ప్రవర్తించారని, దళితులపై దాడి చేయడం అమానుషమని హిందూ సంఘాలు మండిపడ్డాయి.
పోలీసులు కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం దళిత యువకుడి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఆ నేపథ్యంలో బాణా సంచా పేల్చారు. ఆ సమయంలో అక్కడ ముస్లింలు కట్టిన తోరణాలపై నిప్పు రవ్వలు పడటంతో వాటిని తీసి పక్కన పెట్టారు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వదంతులు వ్యాపింప జేశారు. దీంతో దాడులకు దారి తీసింది.