Modi : 2024 ఎన్నికలకు ముందు చివరి బంతిలో సిక్సర్లు బాదాలని ప్రధాని మోడీ (Modi) తమ పార్టీ ఎంపీలకు సూచించారు. రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై నిర్వహించిన ఓటింగ్ ను సెమీ ఫైనల్ గా కొందరు విపక్ష సభ్యులు అభివర్ణించారని, కానీ దీని ఫలితమేమిటో దేశ ప్రజలంతా చూశారన్నారు. . విపక్షాలపై ‘సిక్స్’ కొట్టాలని స్వపక్ష ఎంపీలకు సూచించారు. ప్రతిపక్షాల్లో ఒకరిపై ఒకరికే విశ్వాసం లేదని అన్నారు. రాజ్యసభలో కూడా ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రభుత్వం నెగ్గించుకోగలిగింది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగడానికి ముందు మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోడీ .. ఇది వారి సొంత విశ్వాసానికే పరీక్ష అన్నారు.
అవిశ్వాస తీర్మానంలో ఎవరు సమైక్యంగా ఉన్నారో, ఎవరు లేరో విపక్షాల్లో తేలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమలో తాము ఎంతమంది ఐక్యంగా ఉన్నామో, ఎంతమంది లేమో తెలుసుకునేందుకే ఈ తీర్మానం పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ‘ఆ కూటమిలో పరస్పర విశ్వాసం సన్నగిల్లింది.. అందుకే ఈ తీర్మానం తెచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
2018 లోనే తాము వారికి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చామన్నారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ (India) కు ‘ఘమండియా’ అని తన సొంత పేరు ఇచ్చుకున్నానని చెబుతూ.. అంటే ‘అహంకారులని’, వారు బుజ్జగింపు రాజకీయాలే చేస్తుంటారని ఆరోపించారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడేవారు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుంటారని మోడీ విమర్శించారు. ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు విపక్ష కూటమి అవరోధంగా ఉందని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన , బుజ్జగింపు రాజకీయాలను ఈ దేశం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. ‘క్విట్ ఇండియా’ పేరిట ఇది జరగాలన్నారు.