Modi : దక్షిణాఫ్రికా లోని జోహాన్నెస్ బెర్గ్ లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ (Modi)మంగళవారం బయల్దేరి వెళ్లారు.. ఈ 15 వ సదస్సు మూడు రోజులపాటు .. ఈ నెల 24 వరకు జరగనుంది. ఈ సదస్సులో మోడీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. భారత, చైనా సరిహద్దు సమస్యపై వీరిద్దరూ ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. బ్రెజిల్, చైనా, రష్యా, ఇండియాలతో కూడిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు పలు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోంది.
జీ జిన్ పింగ్ తో మోడీ చివరిసారి జీ 20 సమ్మిట్ సందర్భంగా గత ఏడాది నవంబరులో బాలి లో భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చ్యువల్ గా బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారని, అయితే ఆయన తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఈ కార్యక్రమానికి తన ప్రతినిధి బృందంతో బాటు హాజరవుతారని తెలుస్తోంది.
బ్రిక్స్ లో సభ్యత్వం కోసం సుమారు 23 దేశాలు తమ దరఖాస్తులను సమర్పించినట్టు తెలిసింది. . ఈ కూటమిని మరింత విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత, చైనా సరిహద్దు సమస్య చాలా కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కాగా మంగళవారం మోడీ బ్రిక్స్ నేతలతో కలిసి విందులో పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.
భారత, చైనా సైనికాధికారుల మధ్య సుమారు 16 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ బోర్డర్ వివాదం ఇంకా నలుగుతూనే ఉంది. 2020లో గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు.