– మూడోసారి బీజేపీ విజయం పక్కా
– తేల్చేసిన ఇండియా టుడే
– మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
– మోడీకి 52 శాతానికి పైగా ఓట్లు
– రాహుల్ కు 16 శాతమే
– ఎన్డీఏ పనితీరుపై 59 శాతం మంది సంతృప్తి
– ఈసారి 306 సీట్లకు ఛాన్స్
– ఇండియా కూటమికి 193 సీట్లు
ఔర్ ఏక్ బార్.. మోడీ సర్కార్ (Modi Govt) అని అంటోంది భారత్. ఈ విషయం ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బయటపడింది. ఈ సర్వేలో సుమారు 52 శాతం మంది ప్రధాని మోడీ (PM Modi)ని మరోసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తేలింది. ఎన్డీఏ (NDA) పని తీరుపై 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 306 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
వరుసగా మూడోసారి మోడీని ప్రధాని మంత్రిగా చూసేందుకు 52 శాతం ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. కొన్ని నెలల క్రితం జరిపిన సర్వేని చూస్తే పర్సంటేజ్ కాస్త తగ్గినా.. మోడీనే కావాలంటున్నారు ప్రజలు. రానున్న ఎన్నికల్లో మోడీని చూసి బీజేపీకి ఓటు వేస్తామని 44 శాతం మంది పేర్కొన్నారు. ఈసారి కూడా లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో ప్రజలు కూడా ఆయన వైపే అనుకూలంగా తీర్పునిచ్చారు.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 52 శాతం మంది మోడీనే ప్రధానిగా బెస్ట్ అని చెబితే.. కేవలం 16 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వైపు నిలబడ్డారు. ఇండియా కూటమికి 41 శాతం ఓట్లతో 193 సీట్లు వస్తాయని అంచనా వేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 303 సీట్లతో పోలిస్తే 13 తగ్గి 287 సీట్లతో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉందట.
బీజేపీకి, కాంగ్రెస్ (Congress) మధ్య ఓటు శాతం వ్యత్యాసం 17 శాతం వరకు ఉండొచ్చని సర్వే ద్వారా తేలింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం రోజులు గడుస్తున్న కొద్దీ మోడీకి ప్రజాదరణ తగ్గిపోతోందని అంటున్నాయి. అయితే.. కాంగ్రెస్ ఆరోపిస్తున్న దానిలో నిజం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆపార్టీకి వచ్చిన మద్దతు కేవలం 16 శాతం మాత్రమేనని.. మిగిలిన 84 శాతం సంగతేంటని సెటైర్లు వేస్తున్నారు.