ముంబైలోని ముస్లిం విద్యార్థినులు బురఖా ధరించి రావడాన్ని అక్కడి ఓ కాలేజీ నిషేధించింది. యూనిఫామ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఇక్కడి ఎస్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కళాశాల ఇటీవలే కొత్తగా ఈ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా బుర్ఖాలు ధరించిన విద్యార్థినులను క్యాంపస్ లోకి రాకుండా ఆంక్షలు విధించడంతో దీన్ని నిరసిస్తూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల గేటు వద్ద ప్రదర్శనకు దిగారు. కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో చివరకు పోలీసులు సైతం రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది.
తలిదండ్రులు, కాలేజీ అధికారులతో చర్చలు జరపడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఈ ఏడాది నుంచి కళాశాలలో కొత్తగా డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నామని, ఈ విషయాన్నీ ముందుగానే వెల్లడించామని కాలేజీ ప్రిన్సిపాల్ విద్యా గౌరీ లేలే తెలిపారు. నూతన డ్రెస్ కోడ్ పై గత మే 1 నే పేరెంట్స్ తో చర్చించామన్నారు. బురఖా, హిజాబ్, స్కార్ఫ్, స్టిక్కర్లపై బ్యాన్ తో సహా ప్రతి విషయాన్నిస్పష్టం చేశామన్నారు. కొత్త డ్రెస్ కోడ్ కు నాడు అందరూ అంగీకరించారని, కానీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.
ఈ డ్రెస్ కోడ్ ను వ్యతిరేకించే ఏ విద్యార్థిని అయినా కాలేజీని వదిలి వెళ్లవచ్చునని ఆమె చెప్పారు. అయితే సాయంత్రానికి కాలేజీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ తమ సేఫ్టీ కోసం విద్యార్థినులు బుర్ఖా, హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించి కళాశాలకు రావచ్చునని, కానీ తరగతి గదిలోకి ప్రవేశించేముందు వాటిని తొలగించాల్సి ఉంటుందని పేర్కొంది.
సాయంత్రం క్లాసులు ముగిసిన తరువాత వీటిని మళ్ళీ ధరించవచ్చునని క్లారిటీ ఇచ్చింది. కర్ణాటకలో ఇలాగే బుర్ఖా వివాదం గత ఏడాది పెను వివాదానికి దారి తీసింది. దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది.