విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులు వారి పాలిట శాపంగా మారారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది పోయి వారి జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా(Nalgonda District) నడిబొడ్డున జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం.
నల్లగొండ డైట్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(HM) పోలె వెంకయ్య, ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్‌లు వారి వృత్తికే కలకంకం తెచ్చారు. వీళ్లు గురువులు అనే పదానికి మాయని మచ్చగా మిగిలారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ డైట్ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకే విద్యార్థులు ఉన్నారు.
ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచం గురించి తెలుసుకుంటున్న ఆ చిన్నారులపై స్కూల్ టీచర్లు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా తాకడం, ఇష్టారీతిన వ్యవహరించడం వంటివి చేస్తున్నారు. చిన్నారులపై చేతులు వేయడం, ముద్దులు పెట్టడం, ఐ లవ్ యూ అని చెప్తుండటం కలకలం రేపింది. ఈ విషయం స్కూల్లో ఒక మేడంకి పిల్లలు తెలిపారు. ఆమె మీ తల్లిదండ్రులకు తెలుపమని చెప్పగా వారి తల్లితండ్రులకు ఈ విషయం తెలిపారు.
వారు వచ్చి ఉపాధ్యాయులను సదరు విషయంపై అడగగా అక్కడ విద్యార్థునులు ప్రతీ ఒక్కరు వీరి బాధితులే అని తేలింది. వీరిని ఎంఈవో అరుంధతి విచారించారు. అనంతరం పోలీసులు హెచ్ఎం పోలె వెంకయ్యతో పాటు ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.