కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోడీ(PM Modi) పెద్దన్న ఎలా అవుతారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత (MLC kavitha) ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పెద్దన్న అని సంభోదించారు.
ఈ నేపథ్యంలో కవిత ప్రధానిని పెద్దన్న అని రేవంత్ రెడ్డి అనడం మంచిదే.. అయితే ఆ పెద్దన్న తెలంగాణకు ఏమీ చేయలేదంటూ కవిత ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్ధం అవుతోందన్నారు కవిత. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
జీవో నెంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 33 శాతానికిపైగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాల్సిందిపోయి కేవలం 12 శాతం మాత్రమే వస్తున్నాయని విమర్శించారు. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెం 3తో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల నోట్లో మట్టి కొడుతోందని కవిత ఫైర్ అయ్యారు.
మరోవైపు జీవో నెం 3కి వ్యతిరేకంగా ఈనెల 8న మహిళాదినోత్సవం రోజు ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. 626 ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 77మాత్రమేనని పేర్కొన్నారు.