రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటున్న ప్రజలు.. అదే ఉత్సాహంతో లిక్కర్ సేల్స్ (Liquor Sales) సైతం పెంచేశారు. కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరు చూస్తే.. ఔరా అని ఆశ్చర్యపోవలసిందే.. ఆదివారం (Sunday) సెలవు ఉండటంతో.. సేల్స్ పెరగడం కామనే.. కానీ మద్యం డిపోలను ఓపెన్ పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపారంటే ఆ సేల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..
ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకొన్న వారితో పాటు.. క్లబ్బులు, పబ్బుల్లోనూ లిక్కర్ ని భారీగా డంప్ చేశారు. మరోవైపు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతివ్వడం.. దీనితో పాటు రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.. ఆదాయం సైతం భారీగా పెరిగింది.
రాష్ట్రంలో మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్లు, 6.31 లక్షల బీర్ కేస్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క డిసెంబర్ (December) 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ సేల్ కావడం గమనార్హం. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడు పోయాయని అధికారులు వెల్లడించారు..