Pakistan : మలేషియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానంలో పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వల్ల ఆ విమానం సిడ్నీకి తిరిగివచ్చింది. సిడ్నీ నుంచి కౌలాలంపూర్ కు వెళ్తున్న ఈ విమానంలో 45 ఏళ్ళ మహమ్మద్ ఆరిఫ్ అనే పాకిస్తానీ.. తన వద్ద బాంబులున్నాయని, వీటితో విమానానికి నష్టం కలిగిస్తానని బెదిరించాడు. పైగా విమానంలోని మ్యాట్ పై కూర్చుని ప్రార్థన చేస్తూ..ఇతరులను’ అల్లాకు నువ్వు బానిసవా’అని ప్రశ్నించాడట. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది వారించబోగా వారికి ఇబ్బంది కలిగేట్టుగా ప్రవర్తించాడు కూడా.
ఇతడిని తనిఖీ చేయగా బాంబులేవీ లేనట్టు తేలింది. సోమవారం మధ్యాహ్నం సిడ్నీ నుంచి బయల్దేరిన ఈ ఫ్లైట్ ఇతని ప్రవర్తన కారణంగా తిరిగి సిడ్నీకి రాగా ఆస్ట్రేలియా పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. ఈ రకమైన నేరాల వల్లఈ దేశంలో నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, 8 లక్షల జరిమానా కూడా విధిస్తారు.
మహమ్మద్ ఆరిఫ్ ఈ ప్లేన్ లో చేసిన హడావుడి తాలూకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కారణంగా 32 దేశీయ విమానాలను రద్దు చేయడం జరిగిందని, మరి కొన్ని విమానాలరాకపోకల్లో 90 నిముషాల జాప్యం జరిగిందని సిడ్నీ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆరిఫ్ మాజీ మోడల్ అని, నటుడు కూడానని తెలిసింది. ప్రస్తుతం ఇతగాడు ఆస్ట్రేలియా లోని కెన్ బెర్రాలో నివసిస్తున్నట్టు వెల్లడైంది. ఈయన విమానంలో ఎందుకిలా ప్రవర్తించాడో అర్థం కాలేదని అంటున్నారు. బహుశా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని భావిస్తున్నారు.