పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections)లో మోజారిటీ స్థానాలు దక్కించుకోవాలనే ప్రణాళికలో ఉన్న బీజేపీ.. ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించింది. మరోవైపు మోడీ (Modi) సైతం ప్రచారంలో వేగం పెంచారు.. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ (Hyderabad), అమీర్పేట్ (AmeerPet)లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కేంద్ర మంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు.. ఇంకో పదేళ్ల తర్వాత సైతం కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 పైచిలుకు సీట్లలో సత్తా చాటబోతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలోని 14 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అబద్ధపు పథకాలతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు కర్ణాటకలో ఫెయిల్ అయ్యాయని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్పై ఉన్న కోపంతో కాంగ్రెస్కు ఓటేశారన్నారు.
కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా మోడీ నేతృత్వంలో అద్భుత పాలన అందిస్తున్నదని పేర్కొన్నారు. మోడీ హయాంలో రూపాయి అవినీతి కూడా జరగలేదని వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్ గురు స్థానంలో ఉండాలనే ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదిన్నరేళ్లు ప్రధానిగా పని చేసిన మోడీ ఒక్క సెలవు తీసుకోకుండా దేశం కోసం కృషి చేస్తున్నారని అన్నారు..