Telugu News » KCR : బీఆర్ఎస్ కు కేకే ఝలక్!

KCR : బీఆర్ఎస్ కు కేకే ఝలక్!

ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో తనకు బీఆర్ఎస్‌లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్‌ను కలిసి పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు కేకే వెళ్లారు.

by Venu

– ఫలించని కేసీఆర్ తో చర్చలు
– పార్టీ మారేందుకే మొగ్గు చూపిన కేకే
– త్వరలో కాంగ్రెస్ లో చేరిక
– కేకేతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా
– కానీ, బీఆర్ఎస్ లోనే ఉంటానన్న తనయుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం బీఆర్ఎస్ పై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఉనికిని కోల్పోతున్న గులాబీని చిగురింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. పార్టీపై నమ్మకం లేని నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కూడా పార్టీ మారుతున్నారు.

cm kcr submitted resignation letter to governorకొన్నాళ్లుగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కేశవరావును గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పిలిచారు కేసీఆర్. అక్కడ వీరిద్దరి భేటీ కొనసాగింది. కేకే వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో తనకు బీఆర్ఎస్‌లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్‌ను కలిసి పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు కేకే వెళ్లారు. అదీగాక ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లినప్పుడు ఆయన చేతిలో కొన్ని పేపర్లు ఉండటం చర్చాంశనీయం అయింది. దీంతో కేశవరావు రాజీనామా సమర్పించేందుకు వెళ్లి ఉంటారనే చర్చ మొదలైంది. దాదాపు గంటపాటు భేటీ కొనసాగింది. కేకే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ బీఆర్ఎస్ ను బాగా డ్యామేజీ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారంటే బీఆర్ఎస్ ను జనాలు పట్టించుకోవటం లేదని చెప్పకనే చెప్పినట్లుగా భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈమధ్యనే రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో తండ్రీ కూతుళ్లు పార్టీ మారడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ భేటీ తర్వాత కేకే కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయసులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమిటనేది కేకే అంటున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ తో చెప్పినట్టు తెలిసింది. కానీ, కేకే తనయుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment