తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ఈ కేసులో పలువురు అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశంపై కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని కొందరు నేతలతో పాటు.. పెద్దలు హస్తం సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ఈ విషయంలో గతంలో అరుణ్‌కుమార్ అనే లాయర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ఏ–1గా చేర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ సంభాషణలు వినే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ సీఎం హోదాలో చట్టాన్ని చుట్టంలా వాడుకొన్నారని తెలిపారు.
కానీ అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫోన్ ట్యాపింగ్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో అధికార్లు చర్యలు తీసుకోవడం లేదని అడ్వకేట్ అరుణ్ కుమార్ పంజాగుట్ట (Panjagutta) ఠాణాలో మరోసారి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా చిన్న విషయం అని కేసీఆర్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొనడం విడ్డూరమని అన్నారు..
మరోవైపు కేటీఆర్‌పై కూడా అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తాను సాక్షిగా కొన్ని ఛానళ్లలో మాట్లాడితే వాటికి లీగల్ నోటీసులు పంపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. గతనెల 8వ తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ పంజాగుట్ట పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సహా 39 మంది ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.