గుజరాత్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) స్వగ్రామంలో 2800ఏళ్ల కిందటి నాటి ఇళ్లకు(2800 Years old Houses) సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. గుజరాత్(Gujarat)లోని వాద్నగర్లో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలను పరిశోధకులు కనిపెట్టారు. వాద్నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పూర్వీకుల గ్రామం.
3వేల సంవత్సరాల్లో వివిధ సామ్రాజ్యాల ఆవిర్భావం, పతనం, మధ్య ఆసియా యోధులు భారతదేశంపై పదేపదే దాడులు చేయడం వర్షం లేదా అనావృష్టి వంటి మార్పుల వల్లే సంభవించినట్లు వాద్‌నగర్‌లోని తీవ్రమైన పురావస్తు తవ్వకాల అధ్యయనం కూడా వెల్లడిస్తోందని IIT ఖరగ్‌పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. వాద నగర్ బహుళ సాంస్కృతిక, బహుళ-మతాల (బౌద్ధ, హిందూ, జైన మరియు ఇస్లామిక్) స్థావరమని పేర్కొన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖరగ్‌పూర్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), డెక్కన్ కాలేజీ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ క్రీస్తు పూర్వం నాటి పురాతన ప్రదేశాలను కనుగొన్నారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ చెందిన డాక్టర్ అనింద్యా సర్కార్ మాట్లాడుతూ.. 2016 నుంచి ఈ తవ్వకాల పనులు కొనసాగుతున్నాయని, తమ బృందం 20మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపిందని వెల్లడించారు. ఈ మానవ నివాస అవశేషాలు 800 బీసీ నాటిదని తెలిపారు. ఏడు సాంస్కృతిక కాలాల ఉనికిని గుర్తించామన్నారు.
మౌయ, ఇండో-గ్రీక్, షక-క్షత్రప, హిందూ-సోలంకి, సుల్తానేట్-మొఘల్ (ఇస్లామిక్) నుంచి గైక్వాడ్-బ్రిటీష్ వలస పాలన వరకు ఏడు సాంస్కృతిక కాలాలు ఉన్నట్లు వెల్లడైందని ఏఎస్ఐ పురావస్తు శాస్త్రవేత్త అభిజీత్ అంబేకర్ తెలిపారు. అదేవిధంగా తవ్వకాల్లో పురాతన బౌద్ధ విహారం, బంగారం, వెండి, కళాఖండాలు, కుండలు, రాగి, ఇనుప వస్తువులు, గాజులను గుర్తించారు. వాద్నగర్ ఇండో-గ్రీక్ పాలనలో గ్రీకు రాజు అపోలోడాటస్ నాణేల అచ్చులనూ గుర్తించినట్లు చెప్పారు.