అమృత్ భారత్ స్టేషన్ (Amrit Bharat Stations) స్కీం ద్వారా నేడు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దేశంలో 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. రెండు వేల రైల్వే, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు. ఈ నేపథ్యంలో సుమారు రూ.19,000 కోట్ల ఖర్చుతో స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు.
మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు రూ.21,520 కోట్లతో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB), అండర్‌పాస్‌లకు శంకుస్థాపన, ప్రారంబోత్సవం చేయనున్నారు. నిర్మాణ పనులు పూర్తైన లెవెల్ క్రాసింగ్ గేట్లను కూడా మోడీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా రైల్వే శాఖ మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించే దిశగా కృషి చేస్తుంది.
దీని వల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదని, నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కూడా సజావుగా సాగుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోందని తెలిపారు. గత ప్రభుత్వాలేవి రైల్వే రంగాన్ని అంతగా పట్టించుకోలేదని అన్నారు. సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే ఈ రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా కృషి చేస్తోందని తెలిపారు.
కొన్ని దశాబ్ధాలుగా గత ప్రభుత్వాలేవీ వందే భారత్ వంటి రైళ్ల గురించి ఆలోచించలేదని, నేడు ఎన్డీఏ సర్కార్ వాటిని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad), బేగంపేట (Begampet) రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.