ప్రధాని నరేంద్ర మోడీ(PM modi) మరోసారి తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. నవంబర్ 7వ తేదీన బీసీ ఆత్మగౌరవ సభకు, 11వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలు తగు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలునిచ్చారు. ఎన్నికల వేళ మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండు సార్లు తెలంగాణకు రాబోతుండటం ఆసక్తిగా మారింది.
గత నెలలో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పని రహస్యం ఒకటి చెబుతాను. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం కేసీఆర్ దిల్లీకి వచ్చి నన్ను కలిశారు. చాలా ప్రేమ చూపించారు. మీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో నడుస్తోంది. ఎన్డీఏలో చేరుతాం అని కోరారు. నేను తిరస్కరించా’ అని మోదీ సభలో చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కేటీఆర్, హరీశ్‌రావు మీడియాతో ప్రధాని వాఖ్యలు పచ్చి అబద్దాలని కొట్టిపారేశారు. అయితే ఎన్నికల వేళ ఈసారి పర్యటనలో మోడీ మరోసారి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తారా? లేక హామీల వరకే పరిమితం అవుతారా అనేది ఆసక్తిగా మారింది.