బలహీనమైన జీవి బలమైన జంతువుకి ఆహారం అవుతుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రధాన పార్టీలు బలంగా ఉన్న అప్పుడప్పుడు మరో పార్టీ విమర్శల కొరలకు చిక్కడం కనిపిస్తోంది. అలాగని అది బలహీనంగా మారిందని చెప్పలేము.. కానీ నోటి దురుసు వల్ల అలాంటి సమస్యలు తప్పడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) సైతం ఇలాగే వరస వివాదాల్లో చిక్కుకొంటుందని అంటున్నారు..

ఈ విషయంపై ప్రధాని మోడీతో పాటు బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన శామ్ పిట్రోడా (Sam Pitroda) వారసత్వ పన్ను విధించాలని కోరిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సంపద సర్వే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన హామీపై రగులుతున్న నిప్పులో ఈ వ్యాఖ్యలు ఉప్పులా మారి మరింత సౌండ్ పెరిగేలా చేశాయని తెలుస్తోంది.
తాజాగా నేడు కాంగ్రెస్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని సర్గుజాలో మాట్లాడిన ఆయన.. ప్రజలు కష్టపడి సంపాదించిన సంపదను తమ పిల్లలకు అందించకుండా అధిక పన్నులు విధించడం ద్వారా కాంగ్రెస్ తన ఖజానాను నింపుకోవాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు.. పిట్రోడా వ్యాఖ్యలు ప్రమాదకర ఉద్దేశాలను బయటపెట్టాయని పేర్కొన్నారు.
బతికి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా దోచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.. కాగా ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శామ్ పిట్రోడా తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. బీజేపీ, ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు..