కుల వృత్తుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యేకు ప్రభుత్వం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు చేశారు.
గోమాతకు పూజలు చేసిన అనంతరం కార్యాలయంలోని ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజక వర్గ ప్రజలకు కార్యకర్తలకు ఏది అవసరమో దానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కాగా, మంత్రిని కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత రావు, కుమ్మర సంఘం రాష్ట్ర కమిటీ నేతలు కలిసారు. అంతరించిపోతున్న కుమ్మరుల వృత్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఐదెకరాల్లో వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి వృత్తిని కాపాడాలని కోరారు.
యంత్రాల ద్వారా మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉచిత విద్యుత్ అందించాలన్నారు. తయారు చేసిన మట్టి పాత్రలు విక్రయించడానికి ప్రభుత్వ స్థలాలు, మార్కెట్లలో దుకాణాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. కుల వృత్తులను కాపాడడానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.