Prakash Raj :ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదంలో చిక్కుకున్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) పై ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలని కోరుతూ దేశంలో అనేక చోట్ల ప్రజలు గుడులలో ప్రత్యేక పూజలు, దేవతా విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్న తరుణంలో.. దేశ వ్యాప్తంగా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ ఆయన పెట్టిన వివాదాస్పద ట్వీట్ పై నెటిజన్స్ ఫైరయ్యారు. పైగా హిందూ సంఘాల సభ్యులు ఆయనపై కర్ణాటక (Karnataka) లోని భాగల్ కోట్ జిల్లా బనహట్టి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చంద్రుని పై నుంచి విక్రమ్ ల్యాండర్ పంపిన ఫోటో ఇదేనంటూ ఓ చాయ్ వాలా ఫోటోను ఆయన ఈ నెల 20 న ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడగా దానికి ఆయన సమాధానమిస్తూ.. ద్వేషం కేవలం ద్వేషాన్ని మాత్రమే చూస్తుందని, తాను నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ సమయంనాటి ఓ జోక్ ని మాత్రమే ప్రస్తావించానని అన్నారు.
ఆ వ్యోమగామి చంద్రునిపై అడుగు పెట్టినప్పుడు మన కేరళ చాయ్ వాలా సంతోషంతో సెలబ్రేట్ చేసుకున్నాడని, అతని గురించి మాత్రమే గుర్తు చేశానని అన్నారు. ఏ చాయ్ వాలా అన్నది ట్రోలర్లు చూశారా ? జోక్ ని జోక్ లాగే చూడాలని, లేని పక్షంలో అది మనపైనే అనుకోవాల్సి వస్తుందన్నారు.. చివరలో గ్రో అప్ అని హెచ్చరించారు.
మొట్టమొదటిసారి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపలేదా ? 1960 నుంచి మనకు ప్రేరణనిస్తున్న మలయాళీ చాయ్ వాలా కార్టూన్ గురించి మీకు తెలియకపోతే ‘జస్ట్ ఆస్కింగ్’ ను చదివి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ కండి అన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్.. మలయాళీ చాయ్ వాలా-నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ జోక్ కి సంబంధించి ఓ బ్లాగ్ పోస్ట్ ను కూడా తన ట్వీట్ కి జోడించారు.