భారత ప్రధాని మోడీ (PM Modi) అస్సాం (Assam)లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా యునెస్కో (Unesco) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ (Kaziranga National park)లో జంగిల్ సఫారీ రైడ్ ను ఎంజాయ్ చేశారు. కాగా 1957 తర్వాత ఈ పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.
రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం మోడీ అస్సాంలో, తేజ్ పుర్ ఎయిర్ పోర్టుకు చేరుకొన్నారు. సాయంత్రం కజిరంగా నేషనల్ పార్క్‌లో బస చేశారు. నేటి ఉదయం జీపులో కొంత సేపు ప్రయాణం చేసిన తర్వాత.. ఏనుగు (Elephant)పై స్వారీ చేస్తూ కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. మరోవైపు అస్సాంలో 18 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నేడు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
త్వరలో దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మ్రోగనున్న వేళ.. మోడీ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాముఖ్య పట్టణాలను దర్శిస్తూ బిజిబిజీ గడుపుతున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు అస్సాం పర్యటిస్తున్న ప్రధాని.. అనంతరం అరుణాచల్ ప్రదేశ్‌కు బయలుదేరుతారు. అక్కడ పలు కార్యక్రమాలకు హాజరైన తర్వాత, మధ్యాహ్నం జోర్హాట్‌ను సందర్శిస్తారు.. హోలోంగా పథర్‌లో 84 అడుగుల ఎత్తైన అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం జోర్హాట్లోని మెలెంగ్ మెటెలి పోతార్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 5 లక్షల 50 వేలకు పైగా గృహాలకు ‘గృహ ప్రవేశ’ వేడుకను నిర్వహించనున్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కాగా ఈ పర్యటనలో మోడీ వెంట పార్క్ డైరక్టర్ సొనాలి ముఖేష్, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు.
మరోవైపు సఫారీ అనంతరం ఏనుగులకు చెరుకు గడలను తినిపించిన మోడీ.. కజిరంగా నేషనల్ పార్క్ లోని ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించారు. అదీగాక ఇక్కడి అందాలను, తప్పకుండా చూడాలని నేను మీ అందరిని కోరుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇటీవల మోడీ.. సముద్రంలో మునిగిన ద్వారకను సందర్శించి అక్కడ పూజలు చేయడం తెలిసిందే..