కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రాష్ట్ర ప్రజలు అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు (Abhayahastam Applications) రోడ్డుపై దర్శనం ఇచ్చాయి. హైదరాబాద్ (Hyderabad) బాలానగర్ (Balanagar)ఫ్లై ఓవర్ పై ఫామ్స్ ఎగిరి చిందరవందరగా పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎవరో రాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపారు.
ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.5 చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. హయత్ నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు కూకట్‌పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా.. ఓ వ్యక్తి రాపిడో వాహనం మీద తీసుకువెళ్తున్నాడు..
ఆ సమయంలో తాడు తెగి దరఖాస్తులు అన్నీ రోడ్డు మీద పడటంతో.. అటుగా వెళ్తున్న వారు వాటిని చూసి షాక్ అయ్యారు.. ఈ సందర్భంగా స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందినట్టు సమాచారం. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించారు. ఇక దరఖాస్తు చేసున్న వారిలో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసిన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంట గ్యాస్, రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి యేటా ఎకరానికి రూ.15 వేల నగదు, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ.. అమర వీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం వంటి పథకాలను అమలు చేస్తారు.