Telugu News » US Moon Mission: 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్.. కొద్ది గంటలకే సమస్య..!

US Moon Mission: 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్.. కొద్ది గంటలకే సమస్య..!

అమెరికా(USA)లో 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు చేపట్టిన ప్రయోగం సందిగ్ధంలో పడింది. ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్‌ ఆశలు సన్నగిల్లాయి.

by Mano
US Moon Mission: Lander on the moon after 50 years.. Problem in a few hours..!

అమెరికా(USA)లో 50 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు చేపట్టిన ప్రయోగం సందిగ్ధంలో పడింది. లాంఛింగ్ అయిన కొద్ది గంటలకే స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇంధన లీకేజీ లోపం బయటపడింది. పిట్స్‌బర్గ్‌(Pittsburgh)కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్(Astrobotic Technology) అనే ప్రైవేటు సంస్థ ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండర్‌ను పంపింది.

US Moon Mission: Lander on the moon after 50 years.. Problem in a few hours..!

ఈ నేపథ్యంలో ప్రయోగం చేపట్టిన 7గంటల తర్వాత ల్యాండర్‌ను సూర్యుడి దిశగా తిరిగేలా చేశారు. ల్యాండర్‌కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23న జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉంది. అయితే, ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్‌ ఆశలు సన్నగిల్లాయి.

ఈ ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లోపం ఉంటే చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం కోల్పోతుంది. చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రైవేటు కంపెనీగా అవతరించాలని ఆస్ట్రోబోటిక్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ ద్వారా శాస్త్రీయ పరికరాలను చంద్రుడిపైకి పంపింది. ఈ పరికరాలు జాబిల్లి ఉపరితలంపై అధ్యయనంచేసి నాసాకు సమాచారాన్ని చేరవేస్తాయి.

మరోవైపు, వచ్చే కొన్నేళ్లలో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలని నాసా నిర్ణయించింది. 2024 చివరి నాటికి నలుగురు వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి తిరిగి భూమి మీదకు తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అటు హ్యూస్టన్‌ను చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ అనే కంపెనీ త్వరలోనే ల్యాండర్ ప్రయోగం చేపట్టనుంది. జాబిల్లి ప్రయోగాల కోసం ఈ కంపెనీలకు నాసా భారీగా నిధులు సమకూర్చింది.

అగ్రరాజ్యం అమెరికా చివరిసారిగా 1972 డిసెంబర్‌లో అపోలో 17 ప్రయోగం ద్వారా వ్యోమగాములు జీన్ సెర్నన్, హారిసన్ ష్మిట్‌లను జాబిల్లిపైకి పంపించింది. చంద్రుడిపై నడిచిన 11వ, 12వ వ్యక్తులుగా వీరు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అమెరికా చంద్రుడిపై ల్యాండింగ్ ప్రయోగాలు చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టెమిస్ పేరుతో ప్రయోగాలకు సిద్ధమైంది.

You may also like

Leave a Comment