సీఎం జగన్(CM Jagan) రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) విమర్శించారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా(Kisanmorcha) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆమె మాట్లాడారు. జగన్ నిజంగా రైతుల పక్షపాతి అయితే వారంతా ఎందుకింత నైరాశ్యంలో ఉన్నారని ఆమె ప్రశ్నించారు.
ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలవడం అత్యంత ఆవేదన కలిగిస్తోందన్నారు. ధరల స్థిరీకరణ, విపత్తుల నిధులు ఏమయ్యాయని పురందేశ్వరి నిలదీశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేస్తోన్న నిధులతో కనీసం సాగునీటి కాలువల మరమ్మత్తులు కూడా చేయించలేని దయనీయ పరిస్థితిలో పాలన సాగిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రచారం చేసుకుంటోన్న సీఎం జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి అవమానించిన మాట వాస్తవం కాదా? అని పురందేశ్వరి నిలదీశారు. ప్రతి ఒక్కరి నెత్తిన రూ.2.5లక్షల అప్పు ఉంచారని తెలిపారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు రైతులను ముందుండి నడిపిస్తామని జగన్ అధికారంలోకి రాకముందు చేసిన ప్రసంగాలకు వాస్తవాలకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని ఆమె మండిపడ్డారు.
అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతులను అరెస్టు చేయిస్తూ ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో తీసుకొని వాటి పూర్తికి సహకరిస్తామని ముందుకొచ్చినా… సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపించే తీరిక కూడా జగన్ సర్కార్‌కు లేదని ఆయన విమర్శించారు.