Rahul Gandhi : మణిపూర్ అంశంపై పార్లమెంటులో రచ్చ రేపిన కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మళ్ళీ జనంతో మమేకమైపోయారు. శనివారం ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో ఆయన ‘టోడా’ (Toda) గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కేరళ, తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన.. ఈ గ్రామంలో ఈ గిరిజనుల సంప్రదాయబద్దమైన శాలువా వంటిది కప్పుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఏఎన్ఐ షేర్ చేసింది. ఇక్కడి నుంచి ఆయన కేరళలో తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ (Wayanad) ను సందర్శించనున్నారు.
ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వి.టి. సిద్ధిక్ తెలిపారు. ఆదివారం జరిగే జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కూడా రాహుల్ పాల్గొంటారని ఆయన చెప్పారు. కేరళ, తమిళనాడులోపర్యటించిన అనంతరం రాహుల్.. యూరప్ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి.
సెప్టెంబరులో బెల్జియం, ఫ్రాన్స్, నార్వే దేశాలను ఆయన విజిట్ చేయనున్నారని, ఆయా దేశాల్లోని యూనివర్సిటీల విద్యార్థులు, ప్రవాస భారతీయులతో ఇంటరాక్ట్ కానున్నారని తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ ఎంపీలతోనూ ఆయన భేటీ కావచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక రాహుల్ తన రెండో విడత భారత్ జోడో యాత్రను కూడా చేబట్టవచ్చునని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ తెలిపారు. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారని ఆయన వెల్లడించారు. త్వరలో పార్టీ వర్గాలు దీన్ని ధృవీకరిస్తాయని ఆయన చెప్పారు.