సంవిధాన్ బచావో… బీజేపీ హటావో అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే నరేంద్ర మోదీ, బీజేపీల అంతిమ లక్ష్యంగా కనిపిస్తోందంటూ తన ఎక్స్(x) వేదికగా ఆరోపించారు.
రాజ్యాంగాన్ని మార్చాలంటే 400 సీట్లు కావాలని బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన నరేంద్ర మోడీ, ఆయన ‘సంఘ్ పరివార్’ దాగి ఉన్న ఉద్దేశాలను బహిరంగంగా ప్రకటించడమేనని అన్నారు. వారు న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారంటూ దుయ్యబట్టారు. సమాజాన్ని విభజించి, మీడియాను బానిసలుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రతిపక్షాలను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. గొప్ప ప్రజాస్వామ్యాన్ని కలిగివున్న భారత్‌ను సంకుచిత నియంతృత్వంగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర వీరుల కలలు నెరవేరకుండా చేస్తున్న ఈ కుట్రలను ఫలించబోమన్నారు. రాజ్యాంగంలోని ప్రతీ సైనికుడు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన, మైనారిటీలు మేల్కొనాల్సిన అవసరముందన్నారు. ‘మీ గళాన్ని పెంచండి – భారతదేశం మీ వెంట ఉంది..’ అంటూ పిలుపునిచ్చారు.