అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. హిమంత శర్మ అత్యంత అవినీతిపరుడైన సీఎం అంటూ విమర్శించారు. కేసులు పెట్టి తనను భయపెట్టాలనే ఆలోచన హిమంత బిస్వ శర్మకు ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పారు. మీకు వీలైనన్నీ కేసులో పెట్టుకోండని సూచించారు.
మరో 25 కేసులు నమోదు చేసుకోండని, తాను మాత్రం భయపడే వ్యక్తిని కానని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనను భయపెట్టలేవన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టాలని చూస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. అసోంను నాగ్ పూర్ నుంచి నడిపించాలని వాళ్లు అనుకుంటున్నారని అన్నారు.
కానీ వాళ్ల ఆటలను తాము సాగనివ్వబోమన్నారు. అసోంను రాష్ట్రం నుంచే నడిపించాలన్నారు. అసోంలో భయం, ద్వేషాన్ని బిస్వశర్మ వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ప్రజల దృష్టి మరల్చి వారి భూములు, డబ్బును దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయని ఫైర్ అయ్యారు.
మరోవైపు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ్ యాత్రను గువాహటిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీనిపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
యాత్రను బీజేపీ నేతలు అడ్డుకోవడం, పోస్టర్లను చించివేయడం, నేతలపై దాడి చేయడం వంటి అంశాల గురించి లేఖలో ప్రస్తావించారు. కళ్లెదుట సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. న్యాయ్ యాత్రలో పాల్గొంటున్న వారికి భద్రత కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.