వాన రాకడ ప్రాణం పోకడ అనేది వాడుకలో ఉన్న నానుడి.. ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఇప్పటి వరకి ఏ సైంటిస్టులు కూడా కనుగొనలేక పోయారు. నిక్షేపంగా ఉన్నవాడు నిష్కారణంగా కన్ను మూయవచ్చు. అందుకు ఉదాహరణలు లోకంలో పోతున్న ప్రాణాలు.. ఇక ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.
ఈ ప్రమాదాల్లో అసువులు బాస్తున్న వారు ఎందరో. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం మూలంగా జరుగుతున్నవే అని అధికారులు అంటున్నారు. తాజాగా మరో ఘోర ప్రమాదం రాజస్థాన్ (Rajasthan) దౌస జిల్లా కేంద్రంలో జరిగింది. కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఓ బస్సు (Bus Accident) అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ బస్సు హరిద్వార్ నుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్తున్నట్టు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా (Dead) పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది.
కాగా ఘటన సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 28 మంది తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్టు వారు వివరించారు. కాగా అదనపు కలెక్టర్ (Additional Collector) రాజ్‌కుమార్ కస్వా (Rajkumar Kaswa)ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.