రాజస్థాన్ (Rajasthan)లో ఈడీ (ED) దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహేశ్ జోషి (Mahesh Joshi)తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ స్కామ్లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో గతేడాది ఈడీ రెండు సార్లు దాడులు చేసింది.
రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్ జోషికి జైపూర్ లోని హవా మహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ను కాంగ్రెస్ నిరాకరించింది. గతేడాది ఈ కేసుకు సంబంధించి జైపూర్, దౌసాల్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఓ ఐఏఎస్ అధికారి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.
జల్ జీవన్ మిషన్లో అక్రమంగా డబ్బులు స్వాహా చేయడంలో అనేక మంది మధ్యవర్తులు, ప్రాపర్టీ డీలర్లు, రాష్ట్ర ప్రభుత్వ పీహెచ్ఈ విభాగం అధికారులకు సహాయం చేశారని ఈడీ ఆరోపించింది. పలువురు కాంట్రాక్టర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కాంట్రాక్టులు పొందారని ఈడీ అభియాగాలు నమోదు చేసింది.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన నీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంబించింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం రాజస్థాన్లో అమలు చేస్తోంది. ఈ పథకంలో అక్రమాలు జరిగాయని మొదట ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.