అయోధ్య(Ayodhya)లో ‘రామ్ లల్లా’ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని జనవరి 22న నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాక ముందే ప్రారంభోత్సవం చేపట్టడంపై నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ వార్తలపై శంకరాచార్యులు స్పందించారు. జనవరి 22న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గానీ, ప్రధాని మోడీని కానీ తాము వ్యతిరేకించడం లేదని వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ విమర్శించడం లేదని చెప్పారు. హిందూ గ్రంధాల ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం లేదని వెల్లడించారు. ఈ క్రమంలో అసలు ఎవరీ శంకరాచార్యులు, హిందూ మతంలో వారి ప్రాముఖ్యత ఏమిటి? అనే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఎవరీ శంకరాచార్యులు :
ఎనిమిదవ శతాబ్దపు హిందూ ఆద్యాత్మిక గురువు ఆదిశంకరాచార్య బద్రీనాథ్, ద్వారకా, పూరి, శృంగేరీ మఠాలను స్థాపించారు. ఆ నాలుగు ప్రధాన మఠాలకు శంకరాచార్యులు లేదా మఠాధిపతులు నాయకత్వం వహిస్తారు. ఈ మఠాలను పీఠాలు అని పిలుస్తారు. ప్రతి మఠం ఒక్కో వేదానికి సంరక్షకునిగా ఉంటుంది. వేద సాహిత్యాన్ని సజీవంగా ఉంచే బాధ్యత ఈ పీఠానికి ఉంటుంది.
పూరీలోని గోవర్ధన్ మఠం ఋగ్వేదానికి సంరక్షకునిగా వ్యవహరిస్తుండగా, గుజరాత్‌లోని ద్వారకా శారద పీఠం సామవేదానికి బాధ్యత వహిస్తుంది. అలాగే, కర్ణాటకలోని శృంగేరి శారద పీఠం యజుర్వేదం, ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లోని జ్యోతిర్ మఠం అధర్వణ వేదానికి బాధ్యత వహిస్తుంది. అసలు శంకరాచార్యుల ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ముందు ఆదిశంకరాచార్యులు, ఆయన హిందూ మతాన్ని ఎలా పునరుద్దరించారనే విషయాలను తెలుసుకోవాలి.
ఆదిశంకరా చార్యులు ఎవరు :
వాస్తవానికి శంకరాచార్య అనే బిరుదును హిందూ మతాన్ని సంస్కరించి పునరుజ్జీవింపజేసిన వేద పండితుడైన ఆది శంకరాచార్యుల నుండి తీసుకున్నారు. ఆది శంకరాచార్యులు సామాన్య శకం 788లో వైశాఖ మాసంలో కేరళలోని కలడీ గ్రామంలో జన్మించారు. హిందూ మతంపై పెద్ద ప్రభావాన్ని చూపారు. 32 ఏండ్ల వయసులో ఆయన పరమపదించారు.
ఆయన్ని శివుని అవతారంగా భావిస్తారు. కేవలం 16 ఏండ్ల వయస్సులోనే వేదాలను ఆయన అవపోసనపట్టారు. హిందూ మతం ప్రాముఖ్యతను కోల్పోయి బౌద్ద, జైన మతాలు ఓ వెలుగు వెలుగుతున్న కాలంలో చాలా చిన్న వయస్సులో శంకరాచార్యులు బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలపై తన వ్యాఖ్యానాలను వ్యాప్తి చేసేందుకు దేశవ్యాప్త పర్యటన చేశారు. శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించారు.
ఆత్మ, పరమాత్మ వేరు కాదని రెండూ ఒకటేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ఆకాలంలోనే ఆయన వ్యాప్తి చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాలని ప్రయత్నించారు. ఈ మేరకు తన బోధనలు, తత్వ శాస్త్రాన్ని, హిందుమతాన్ని వ్యాప్తి చేసేందుకు దేశంలోని నాలుగు మూలల్లో నాలగు మఠాలను
ఆది శంకరా చార్యులు స్థాపించారు. ఆ మఠాలకు అధిపతులను శంకరాచార్యులుగా పిలుస్తున్నారు.
నలుగురు శంకరాచార్యుల పాత్ర ఏంటి:
రాజ్యాంగాన్ని అన్వయించేటప్పుడు దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకు అంతిమ అధికారం ఉన్నట్లే, హిందూమతంలో, హిందూ గ్రంధాలను వివరించే, వ్యాఖ్యానం చేసే విషయంలో శంకరాచార్యులకు అధికారం ఉంది. ఆ నాలుగు మఠాధిపతులు ఆది శంకరాచార్యల బోధనలను, ఆయన సిద్దాంతాలను వ్యాప్తి చేస్తారు. దీంతో పాటు పవిత్ర హిందూ గ్రంధాలను పరిరక్షించడం, వాటిపై వ్యాఖ్యానాల విషయలంలో కీలక పాత్ర పోషిస్తారు.
హిందూ మతంలోని వివిధ ఆలోచనా విధానాల మధ్య ఈ శంకరాచార్యులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. దశనామి వ్యవస్థను వీరు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం స్వామి నిశ్చలానంద సరస్వతి గోవర్ధన్ మఠానికి, అవిముక్తేశ్వరానంద సరస్వతి జ్యోతిర్ మఠానికి, స్వామి భారతీ తీర్థ శృంగేరి పీఠానికి, స్వామి సదానంద సరస్వతి ద్వారకా పీఠానికి శంకరాచార్యగా ఉన్నారు.