Telugu News » Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా..?

Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా..?

ఇన్నాళ్లూ కేసీఆర్ వైఖరి తెలిసిన వారెవ్వరూ కనీసం తమ అభిప్రాయాలను వినిపించడానికైనా అంతగా సాహసం చేయలేదు.. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఇప్పుడు ముందుకు వచ్చి ధైర్యంగా అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

by Venu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు పడటంతో.. ప్రస్తుతం గులాబీ తోటలో అయోమయం నెలకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వెతికితే.. కేసీఆర్ (KCR) అంటేనే మొండితనానికి నిదర్శనమని కొందరు చెవులు కోరుక్కోంటున్నారు.. పదేళ్ల పాలనను అదేరీతిలో సాగించడం.. రాజకీయ వారసుడిగా కొడుకును సీఎం పీఠం మీద కూర్చోపెట్టి.. హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో.. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)ని కాస్త బీఆర్ఎస్ గా మార్చడం పెద్ద ముప్పుగా చర్చించుకొంటున్నారు.

నిజానికి భారాస పేరుతో కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన చేసినప్పటికీ.. చివరికి తెలంగాణ (Telangana) పేరు కాస్త మారడంతో.. స్ఫూర్తి దెబ్బతిన్నదని కార్యకర్తలు అనేకమంది చిన్నబుచ్చుకొన్నారు. కానీ.. కేసీఆర్ పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత.. లోక్ సభ ఎన్నికలకు సిద్ధం చేసే సన్నాహక సమావేశాల్లో కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులోంచి తొలగించడం ద్వారా.. పార్టీ అస్తిత్వం నాశనం అయినట్టు కడియం శ్రీహరి ఘాటుగానే వినిపించారు.

ఇది కడియం ఒక్కరి మాట కాదు. ఇన్నాళ్లూ కేసీఆర్ వైఖరి తెలిసిన వారెవ్వరూ కనీసం తమ అభిప్రాయాలను వినిపించడానికైనా అంతగా సాహసం చేయలేదు.. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఇప్పుడు ముందుకు వచ్చి ధైర్యంగా అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఒకసారి కేంద్రమంత్రిగా వైభవం వెలగబెట్టిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తన ముద్ర చూపించాలనే తపనతో తహతహలాడిపోతున్నారు. అయితే.. విపక్ష కూటమి ఆయనను దూరం పెడుతూందనే ఆరోపణలున్నాయి..

బీజేపీ (BJP)కి బీ టీమ్ గా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే ఆయన జాతీయ పార్టీ డ్రామా నడిపిస్తున్నారనే విమర్శను దూరం చేసుకోలేకపోతున్నట్టు చర్చించుకొంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022, 2023లో మహారాష్ట్ర పై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ (BRS). నాగ్‌పూర్, సోలాపూర్, నాందేడ్ ప్రాంతాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి కార్యాలయాలు సైతం ప్రారంభించింది.

ఏపీలో తోట చంద్రశేఖర్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన కేసీఆర్.. పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటకలో పార్టీని విస్తరించేందుకు ప్లాన్ చేశారు. ఢిల్లీలో సొంత కార్యాలయాన్ని నిర్మించారు. కానీ రాష్ట్రంలోనే అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో జాతీయ పార్టీని రాష్ట్ర పార్టీగా మార్చే భావనలో ఉన్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment