అయోధ్య(Ayodhya)లో జనవరి 22న జరిగే రామ్ లల్లా(Ram Lala) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ(BJP) అధినేత ఎల్కే అద్వానీ(LK Adwani) హాజరు కానున్నట్లు సమాచారం. జనవరి 16 నుంచి ఏడు రోజుల పాటు జరిగే వేడుకలకు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
జనవరి 15 నాటికి పట్టాభిషేక మహోత్సవానికి సన్నాహాలు పూర్తి చేయనున్నారు. అయితే, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ ఇదివరకు తెలిపింది.
తాజాగా, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా వీహెచ్పీ డిసెంబరులో సీనియర్ బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను ఆహ్వానించింది. వీహెచ్పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ఎల్కే అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
జనవరి 22న పరిమిత ఆహ్వానితులతో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది సాధువులను ఆహ్వానించారు. రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలనూ ఆహ్వానం పలికారు.