త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి.. బీఆర్ఎస్ (BRS) సీట్లు క్రమక్రమంగా ఖాళీ అవుతున్నాయి.. మేము పార్టీ మారం.. కారును విడిచి వెళ్ళం.. అంటూ.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నేతలు సైతం.. గులాబీ కండువా మార్చడం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్‌కు మరో సంచలన షాక్ తగిలింది. ఆ పార్టీ మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. అనంతరం తన రాజీనామా విషయాన్ని ప్రజలకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న అనుమానాలను తుంచేశారు..
అయితే పార్టీ మారడంపై వివరణ ఇచ్చిన రంజిత్ రెడ్డి.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.. ఇంతకాలం తనకు పార్టీలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.. ఇన్ని రోజులు చెవేళ్ల (Chevella) ప్రజలను సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్ (KTR)కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం తన రాజీనామాను ఆమోదించాలని రంజిత్ రెడ్డి గులాబీ బాస్ ను రిక్వెస్ట్ చేశారు..
మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్ (Hyderabad), బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకొన్నారు. ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షాను ఆయన కలిశారు. స్పష్టమైన హామీతోనే ఆ పార్టీలో చేరినట్లు సమాచారం.