భారత(Bharath) ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా బలపడుతోంది. దీని కారణంగా భారత్‌పై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ విషయాన్ని మరెవరో కాదు.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్(Reserve Bank Governor) శక్తికాంత దాస్(Shaktikantha das) వెల్లడించారు.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘హై గ్రోత్, లో రిస్క్ ఇండియా స్టోరీ’ అనే అంశంపై నిర్వహించిన సీఐఐ సెషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో శక్తికాంత దాస్ భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు.
‘‘ప్రపంచ ఆర్థిక రంగంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందుతుంది.. భారత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్యస్థ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి..’’ అంటూ తెలిపారు.
అదేవిధంగా ‘‘భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.. ఇటీవలి గ్లోబల్ షాక్ నుంచి బయటపడ్డాం.. విదేశీ మారక ద్రవ్య నిల్వలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవచ్చు.. 2022 వేసవి కాలం నుంచి ప్రధాన ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది..’’ ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
అదేవిధంగా సవాలుగా మారిన ప్రపంచ స్థూల ఆర్థిక వాతావరణం మధ్య భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి ఉదాహరణగా నిలుస్తోందని దాస్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగమించే అవకాశం ఉందని, మార్కెట్లు సానుకూలంగా స్పందించాయని చెప్పారు. అయినా కొన్ని అంతర్జాతీయ, వాతావరణ ముప్పును ఎదుర్కోక తప్పదన్నారు.