పవర్ స్టార్స్ పవన్ కళ్యాణ్(Power star Pawan Kalyan),సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో(Bro) సినిమాలోని ఓ సీన్..సరికొత్త రచ్చకు తెరతీసింది. నటుడు పృధ్వీ నటించిన సదరు సీన్ ఓ మంత్రి మనోభావాన్ని దెబ్బతీసినట్టుగా ఉండడం వివాదాస్పదమైంది.
దీంతో ఆ పార్టీ మంత్రులు ప్రజా సమస్యలను పక్కనబెట్టి సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. ప్రతిదాడి మొదలు పెట్టారు. మనోభావం దెబ్బతిన్న మంత్రైతే..తాము తీయబోయే సినిమాలు, వెబ్ సిరీస్ (Web series) లకు వివిధ టైటిల్స్ పరిశీలిస్తున్నామంటూ మీడియా సమావేశం పెట్టిమరీ వెల్లడించారు.
ఆ టైటిల్స్ అన్నీ పరోక్షంగా పవన్ పర్స్ నల్ లైఫ్ ని టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) దీనిపై స్పందించారు.
ఓ వీడియోను పోస్ట్ చేశారు. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ‘బ్రో(Bro)’ సినిమా శ్యాంబాబు వివాదం గురించి ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఇటీవలె విడుదలైన సినిమా కాంట్రవర్సీలకు దారితీసింది. ఇదంతా జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. తిరిగి వచ్చిన తర్వాతే తెలిసింది. కొందరు వ్యక్తులు నా మాజీ భర్త. వ్యక్తిగత విషయాలు, పెళ్లి, పిల్లలనుద్దేశించి వెబ్ సిరీస్లు తీస్తామంటున్నారు.ఓ తల్లిగా చెబుతున్నా దయచేసి పిల్లలను ఇందులో లాగకండి” అని రేణూ అన్నారు.
“నా విషయంలో జరిగింది వంద శాతం తప్పే. కానీ నాకు తెలిసిన, నేను చూసినంత వరకూ.. ఆయన డబ్బు ఆశించే వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ సమాజానికి మంచి చేయాలని పరితపించే మనిషి.
ఆయన అరుదైన వ్యక్తి. నేను నా వ్యక్తిగత విషయం పక్కనపెట్టి రాజకీయంగా మద్దతిచ్చాను, ఇస్తున్నాను కూడా. సొసైటీ కోసం.. ఆయన వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓ సక్సెస్ఫుల్ నటుడు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి.
ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలనూ ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే” అని ఆమె చెప్పారు.