తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావస్తుంది. కానీ రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురిని సీఎం కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకొంది. అయితే ఈ ప్రచారానికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం రేవంత్ రెడ్డి అని సమాచారం.
అయితే మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు ఎన్నికల తర్వాత చేపట్టడం మంచిదని రేవంత్ (Revanth Reddy)హైకమాండ్ కు సూచించినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ మరికొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచాక కొత్త మంత్రి వర్గం ఏర్పాటయింది.
ఆ సమయంలో మరో ఆరుగురిని త్వరలో కేబినెట్ లోకి తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు. ఈమేరకు ముఖ్యంగా మైనారిటీలకు అవకాశం ఇచ్చే అవకాశముందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతల్లో కొందరిని ఎమ్మెల్సీలు అయినా వారిని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారని వార్తలు వ్యాపించాయి. కానీ మంత్రి వర్గ విస్తరణ పార్లమెంటు ఎన్నికలకు ముందు చేపడితే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోయే అవకాశాలున్నట్లు భావించి.. కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయాన్ని సీఎం, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని, ఆరుగురిని ఒకేసారి పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకొందామని చేసిన సూచనకు పార్టీ నాయకత్వం సమ్మతించినట్లు సమాచారం. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు కూడా ఉండటం మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడటానికి మరొక కారణంగా చెబుతున్నారు. కానీ జరిగే సీన్ బట్టి చూస్తే మంత్రి వర్గ విస్తరణకు మరో మూడు నెలలకు పైగానే సమయం పట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది..