టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ న్యాయమైన పద్ధతిలో పోటీ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కాంగ్రెస్ సవాళ్లను స్వీకరించి ఎన్నికల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. విధివిధానాలపైనే ఎన్నికలకు వెళ్దాం.. రండి.. మద్యం, డబ్బు పంచకుండా శాసనసభ ఎన్నికల్లో పోటీకి రావాలి.. అంటూ రేవంత్ డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారని.. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఇబ్బంది పెట్టారని రేవంత్ మండిపడ్డారు. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా.. సోనియాగాంధీ ధర్మం వైపు నిలబడటం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలిపారు.
రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు గుర్తులే కనిపిస్తున్నాయి.. కానీ అందులో ఉండాల్సింది ప్రజల త్యాగాల గుర్తుల.. రాష్ట్రం అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడంలేదు. నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజల ప్రాథమిక హక్కులను ఈ పదేళ్లలో కేసీఆర్ కాలరాశారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని తెలిపారు. సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను, మీడియా మిత్రులను రానివ్వడం లేదు. కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్.’ అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో మార్పులు చూస్తామన్న యువత ఆకాంక్షలు అడియాశలయ్యాయని, మేడిగడ్డ కుంగిందని.. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని విమర్శించారు. మైనార్టీలకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.10 వేలు వేస్తామని తాము 2014లోనే హామీ ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్ విధానాలేనని, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్‌ను మార్చే ప్రణాళిక తమ వద్ద ఉందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు మా పార్టీకి సహజ మిత్రులని, సీపీఐ, సీపీఎం నేతలతో తమ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రేవంత్ తెలిపారు.
‘రాహుల్ గాంధీ ఆల్ ఇండియా పప్పు, రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు..’ అంటూ కేటీఆర్ వేసిన సెటైర్లకు రేవంత్ అదేరీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది.. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివాడు.. తింటే చస్తారని దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు’ అని ఎద్దేవా చేశారు.