అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అభయహస్తం గ్యారంటీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సచివాలయం వేదికగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియా గాంధీ (Soniya Gandhi) ఆరు గ్యారంటీలను తెలంగాణ (Telangana) ప్రజలకు అంకితమిచ్చారని అన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని వెల్లడించారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయంలో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారని తెలిపిన సీఎం.. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమని, ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదికగా ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడారు.
కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ధరల నుంచి మహిళలకు ఊరట కల్పించాలని భావించి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. కాగా ఈ స్కీమ్‌తో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల వైపు దేశమంతా చూస్తోందని అన్నారు.