Telugu News » Telangana : తెలంగాణ వార్.. ఎవరి లాభం వారిదే!

Telangana : తెలంగాణ వార్.. ఎవరి లాభం వారిదే!

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రక వాస్తవం ఏమిటో.. నీ పార్టీ అధ్యక్షుడి మాటల్లోనే విను డ్రామారావు అంటూ కేసీఆర్ వీడియోను పోస్ట్ చేశారు.

by admin
revanth-vs-ktr

– కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
– ‘తెలంగాణ’ కోసం కొట్లాట
– రాష్ట్రం తెచ్చారా? ఇచ్చారా?
– నేతల మధ్య ముదురుతున్న గొడవ
– సోనియాపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
– కేసీఆర్ వీడియోతో రేవంత్ కౌంటర్

సకలజనులు కొట్లాడి సాధించుకున్నది తెలంగాణ. ఇది ఏ ఒక్కరికీ సంబంధించింది కాదు. నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా ఒక్కరేంటి అందరూ కలిసి పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో తెలంగాణ (Telangana) సెంటిమెంట్ విషయంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య పోటీ నెలకొంది. కేసీఆర్ (KCR) వల్లే తెలంగాణ వచ్చిందనేది గులాబీ నేతల వాదనైతే.. పిల్లల చావులు చూసి చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది.

revanth-vs-ktr

తెలంగాణ ఏర్పాటుపై మంగళవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు ఒకరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా..? ఒక్కరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చింది అంటే కూడా అంతే దరిద్రంగా ఉంటుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్)లో ఫైరయ్యారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పదే పదే నువ్వు మాట్లాడుతున్న మాటలు.. చరిత్ర తెలియని అజ్ఞానమా..! అవకాశవాద రాజకీయమా..? సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రక వాస్తవం ఏమిటో.. నీ పార్టీ అధ్యక్షుడి మాటల్లోనే విను.. డ్రామారావు’ అంటూ కేసీఆర్ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

ఇక ఇదే అంశంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. కేటీఆర్ కు రాజకీయాలపై అనుభవం లేదని అన్నారు. తాము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు (Chandrababu) మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టారని.. సొంత పార్టీ నేత అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) ని ఎదిరించి తాము తెలంగాణ కోసం కొట్లాడామని వివరించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆరే అన్నారని.. పిల్లల మరణాలకు చలించి ఆమె తెలంగాణ ఇచ్చారని తెలిపారు కోమటిరెడ్డి. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.

You may also like

Leave a Comment