బిహార్(Bihar)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. పెళ్లి(Marriage)కి వెళ్లి వస్తున్న కారును ఓ ట్రాక్టర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. పస్రాహా పోలీస్ స్టేషన్(Pasraha Police Station) పరిధిలోని విద్యానంద్ పెట్రోల్ బంక్ సమీపంలో సిమెంట్ లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు గోగ్రీ డీఎస్పీ రమేష్ కుమార్ వెల్లడించారు.
కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజుల కిందట బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ఇలాంటి ఘోర ప్రమాదమే చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా తొమ్మిది మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది.