మణిపూర్ అంశంపై గురువారం కూడా లోక్ సభ అట్టుడికింది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలన్న డిమాండుతో విపక్షాలు సభా కార్యకలాపాలను స్తంభింపజేయడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. ప్రతిపక్షాల రభసపై ఆగ్రహిస్తున్న స్పీకర్ ఓంబిర్లా, వరుసగా రెండో రోజైన గురువారం కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభకు హాజరు కాలేదు. మణిపూర్ పరిస్థితిపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న విపక్ష సభ్యుల్లో కొందరు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని సభ వెల్ లోకి దూసుకుపోయారు.
స్పీకర్ ఓంబిర్లా సభకు రావాలని, ఆయన తమ ‘కస్టోడియన్’ అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఓ దశలో వ్యాఖ్యానించారు. ఈ మెసేజ్ ని తాను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్ తెలిపారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు తమ సీట్ల వద్దకు వెళ్లి కూర్చోవాలని, ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా కొనసాగేలా చూడాలని ఆయన కోరారు. అయితే విపక్షాలు తమ నినాదాలను కొనసాగించాయి. ఏమైనా సభ ప్రారంభమైన 20 నిముషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
రాజ్యసభలో రభస
ప్రధాని మోడీని మీరు వెనకేసుకొని వస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ని ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. మణిపూర్ అంశంపై సభలో మోడీ ప్రకటన చేయకుండా మీరు అడ్డుకుంటున్నారన్న ధోరణిలో ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ధన్ కర్.. ప్రధాని నేతృత్వం కింద మూడు దశాబ్దాలుగా కొనసాగిన ఆయా సంకీర్ణ కూటమి ప్రభుత్వాల హయాంలో తానెవరినీ సమర్థించలేదన్నారు. రాజ్యాంగాన్ని తాను పరిరక్షించవలసి ఉందని, అలాగే మీ హక్కులను కూడా కాపాడవలసి ఉందని ఆయన చెప్పారు.
మణిపూర్ పరిస్థితిపై సమయంతో గానీ, ఇతర నిబంధనలతో గానీ నిమిత్తం లేకుండా నేను చర్చకు అనుమతిస్తానని, ఫ్లోర్ లీడర్లంతా తన ఛాంబర్ లో హాజరు కావచ్ఛునని ఆయన అన్నారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఫారెస్ట్ కన్సర్వేషన్ (సవరణ) బిల్లు-2023 ని నిన్న సభ ఆమోదించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ ప్రస్తావిస్తూ .. అటవీ భూముల్లో నివసిస్తున్న పేదల ప్రయోజనాలను మొదట కాపాడవలసి ఉందన్నారు. ఈ బిల్లుకు మరిన్ని సవరణలు చేయాలని తాను గతంలోనే ఎన్నోసార్లు కోరానన్నారు.