కేరళ(Kerlala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయం మళ్లీ తెరుచుకుంది. మండల పూజల అనంతరం ఈనెల 27వ తేదీ రాత్రి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మకరజ్యోతి ఉత్సవాల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారి పీఎన్ మహేష్ నంబూత్రి ఆలయాన్ని తెరిచారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలో శాస్త్రోక్త సంప్రదాయాలను మేళవించుకొని తంత్రి పూజారి కందరరు మహేష్ మోహనరరు సమక్షంలో పూజలు చేశారు.
మకరజ్యోతికి భక్తుల రద్దీని నివారించేందుకు జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌ను 50వేలకు తగ్గిస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీసీ ప్రశాంత్ తెలిపారు. రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌ను 10వేలకు పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ.. 14న బింబ శుద్ధ క్రియ నిర్వహించనున్నట్లు శబరిమల ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
జనవరి 15న మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే మకరజ్యోతి పూర్తయిన తర్వాత కూడా జనవరి 20 వరకు శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆలయాన్ని తెరిచి ఉంచనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. భక్తులు నేరుగా పంబకు వెళ్లే బదులు నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
నవంబరు 17వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకూ 40 రోజుల్లో దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయితే గతేడాది కంటే రూ.18.72కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొంది.