Telugu News » Telangana : ప్రమాదం అంచున ప్రాజెక్టులు.. వేల కోట్ల ఖ‌ర్చు ఎక్కడ సారు..!?

Telangana : ప్రమాదం అంచున ప్రాజెక్టులు.. వేల కోట్ల ఖ‌ర్చు ఎక్కడ సారు..!?

ప్రాజెక్టుల ప‌ట్ల కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్లక్ష్యం వ‌హించిందనే ఆరోపణలు వస్తున్నాయి.. ప‌దేండ్ల పాటు ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు దేవుడు ఎరుగు.. క‌నీసం వాటి నిర్వహ‌ణ‌కు సైతం స‌క్రమంగా నిధులు కేటాయించ లేదంటున్నారు.. ఫలితంగా ప్రాజెక్టులు ప్రమాదం అంచున చేరాయంటున్నారు..

by Venu

మనుషులందరూ భూమి మీద తిరుగుతారు.. కానీ రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడని అంటారు.. అందుకే కావచ్చు.. ఒక మెతుకు పుట్టించడానికి రైతుపడే కష్టం.. బిడ్డని పుట్టించడానికి తల్లిపడే పురిటినొప్పులకి ఏమాత్రం తీసిపోదని, రైతుని ఆకాశానికి ఎత్తుతారు.. అలాంటి రైతుల పాలిట క‌ల్పత‌రువులు ప్రాజెక్టులు.. వీటిలో నీరు నిండితేనే వారు పంట పండించేది.. మ‌న క‌డుపు నిండేది.

అలాంటి ప్రాజెక్టుల ప‌ట్ల కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్లక్ష్యం వ‌హించిందనే ఆరోపణలు వస్తున్నాయి.. ప‌దేండ్ల పాటు ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు దేవుడు ఎరుగు.. క‌నీసం వాటి నిర్వహ‌ణ‌కు సైతం స‌క్రమంగా నిధులు కేటాయించ లేదంటున్నారు.. ఫలితంగా ప్రాజెక్టులు ప్రమాదం అంచున చేరాయంటున్నారు.. రైతుల కోసమే ఉన్నాం.. వారి కోస‌మే బ‌తుకుతున్నామ‌ని, ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని గత ప్రభుత్వనేతలు ఊద‌ర‌గొట్టారు. కానీ, వాస్తవ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందంటున్నారు..

ఈ క్రమంలో ప్రభత్వ నిర్లక్ష్యానికి గురైన వాటిలో ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ప్రాజెక్టులు ఉన్నాయి.. వ‌ర‌ద ఉధృతికి ఏ ప్రాజెక్టు కొట్టుకుపోతుందో తెలియ‌దు. ఏ ప్రాజెక్టుకు గండి ప‌డుతుందో తెలియ‌ని ద‌య‌నీయ ప‌రిస్థితికి చేరుకున్నాయంటున్నారు.. నిర్మల్ (Nirmal) జిల్లాలో ఉన్న క‌డెం ప్రాజెక్టు ప‌రిస్థితి మ‌రీ దారుణం. రెండేళ్లు వ‌రుస‌గా వ‌ర‌ద రావ‌డంతో తెగిపోయే ప‌రిస్థితి నెల‌కొన‌డం, ప్రజ‌లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని జీవించ‌డం ఇక్కడ ప‌రిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు..

క‌డెం ప్రాజెక్టు (Kadem Project)కు సంబంధించి ఈ వ్యవ‌హారం గ‌త ఏడాదే కాదు.. భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్రతీ ఏటా ఇదే గోస‌ అని అంటున్నారు.. మరోవైపు ఈ ప్రాజెక్టును డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ (డీఎస్‌ఆర్‌పీ) తనిఖీలు చేసి అదనంగా 5 గేట్లతో స్పిల్‌ వే కట్టాల‌ని నివేదిక ఇచ్చింది. వీటికోసం సుమారు రూ. 700 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనాలు వేసి ఐదు గేట్లతో స్పిల్‌వే కోసం ప్రతిపాదనలు సైతం అధికారులు సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన దీని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి..

గ‌త‌ ప్రభుత్వం నీటిపారుదలశాఖలో కీలకమైన మెకానికల్ విభాగాన్ని ఎత్తేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టుల గేట్ల ఓవర్ హాలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టి వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచే ఈ శాఖ ఉనికిలో లేకుండా పోయింది. దీంతో దశాబ్దాలుగా గేట్లు మరమ్మతులకు నోచుకోక, గేట్లు ఓపెన్ కావ‌డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తీవ్ర వ‌ర‌ద‌ల స‌మ‌యంలో.. కడెం జలాశయానికి గండి పడి ఉంటే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగేవి. ఏటా ఇలాగే అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోలేదంటున్నారు..

ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంటే ఎవ‌రైనా మ‌ర‌మ్మ‌తులు చేస్తారు. కానీ, తెలంగాణ సాగునీటి శాఖ అధికారులు మాత్రం వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్లను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు. రెండేళ్ల కింద‌ట కొమురం భీమ్ ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద చేరడం వల్ల ప్రమాదం అంచుకు చేరింది. రాళ్ళు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. ఆనకట్ట పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు.

ఈ ప్రాజెక్టు 15 ఏళ్ల కిందట పది టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఎప్పుడు సక్రమంగా నీరందించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడటంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

You may also like

Leave a Comment