పథకాలు, సంస్కరణల్లో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ (CM Jagan) పెద్ద పీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవని చెప్పారు. కానీ అర్హులైన ప్రతి ఒక్కరినీ వెతికి మరి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని వెల్లడించారు. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయని చెప్పారు.
అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నా వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత జరగని అభివృద్ధి పనులు ఈ నాలుగున్నరేండ్లలో జరిగాయని తెలిపారు.
11 మెడికల్ కాలేజీలతో స్పెషలిస్టులను తయారు చేసుకునేలా ఎదగడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ చెప్పుకోవడం లేదంతేన్నారు. అంబేడ్కర్ మహా విగ్రహాన్ని నిర్మించి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని వెల్లడించారు. అణగారిన వర్గాలు పైకి వచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు హిమాలయమంత విగ్రహం పెట్టినా సరిపోదన్నారు. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరమని చెప్పారు. అందుకే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విజయవంతంగా అభివృద్ధికి వినియోగించామన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలు వేరే విధంగా ఉంటాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో అసోసియేట్ అవ్వడమే వైసీపీ లక్ష్యమన్నారు.