బిహార్ సీఎం(Bihar CM) నితీష్ కుమార్(Nitish Kumar) మానసిక స్థితి బాగాలేదంటూ శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్.. సీఎం నితీష్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. నితీష్ కుమార్ పేరును ఇండియా కూటమిలో ముఖ్యస్థానం కోసం ఎప్పుడూ చర్చించలేదన్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇటీవల ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో కన్వీనర్ పదవికి నితీష్ కుమార్ పేరును సూచించారని తెలిపారు. అయితే కూటమిలో ముఖ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారని, కన్వీనర్‌ను నియమించాల్సిన అవసరం లేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికల్లో శదర్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్) విజయం సాధిస్తాయని అన్నారు. “నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఎప్పుడూ ముందంజలో లేరు. సీఎం నితీష్ కుమార్, బీజేపీల మానసిక స్థితి బాగాలేదు. వారు రాజకీయ మైదానంలో ఇలాంటి గేమ్స్ ఆడకూడదు” అని రౌత్ అన్నారు.
ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎన్డీయేతో జతకట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ మద్దతుతో నిన్న 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్, ఎన్డీయేలో చేరడం కూటమి జీర్ణించుకోలేకపోతోంది. కూటమిలోని కీలక పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే నితీష్ కుమార్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.